దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్రపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది
X
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు రావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు మాజీ గవర్నర్, మాజీ డీజీపీ పీఎస్ రామ్మోహన్ రావు రచించిన ‘గవర్నర్పేట్ టు గవర్నర్ హౌస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకం పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.
“జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది. ఇది అందరం నిశితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించారు. ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఆ తరం తర్వాత మళ్లీ జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే .. ఎవరిని కలవాలో, ఎవరు మనవాళ్లు ఉన్నారో తెలియని పరిస్థితి. మన ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించాలన్నా మాట్లాడే నేతలే కనిపించడంలేదు. రాను రాను.. ఇది మన గుర్తింపు, గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమో. ఫుల్ టైమ్ రాజకీయ నేతలు లేకపోవడమో.. పార్టమ్ పాలిటిక్స్, పుల్టైమ్ బిజినెస్ చేసే వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల జరుగుతుందో తెలియదు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మన గుర్తింపునకు, దేశ రాజకీయాల్లో తెలుగు భాషకు., ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. ఈ పరిణామాలను మేధావులు ప్రస్తావించాలి. మళ్లీ తెలుగువారంతా కలిసి రాణించాల్సిన అవసరముంది" అని అన్నారు.
"దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. జాతీయ స్థాయిలో మన భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు.. రాజకీయాల్లో కూడా అదే విధంగా ప్రభావం చూపించాలి. అధికారిక నిర్ణయాల్లో మనం భాగస్వాములుగా ఉండాలి. గతంలో రాష్ట్రపతి పదవి ఉత్తర భారత దేశానికి ఇస్తే.. ప్రధాన మంత్రి పదవి దక్షిణాదికి ఉండేది. ఎప్పుడూ సమతూకం పాటించే వారు. కీలకమైన మొదటి 5 శాఖల్లో మూడింటికి కచ్చితంగా దక్షిణాది నుంచి ప్రాతినిథ్యం వహించే వారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం, పరిష్కారాలపై అనుభవజ్ఞులు ఆలోచన చేయాల్సిన అవసరముంది. జాతీయ విషయాలు వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన చేయాలి, ప్రాంతీయ అంశాలు వచ్చినప్పుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే విచక్షణ ఉండాలి. పీవీ నరసింహారావుకు దేశ ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు నంద్యాలలో పోటీ చేస్తే.. ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీఆర్ పోటీ పెట్టలేదు. ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించారు. మంచి సంప్రదాయాలను పాటించేందుకు, గౌరవించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగువారిగా కలిసి ఉందాం. అభివృద్ధిని మన ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉంది. అనుభవజ్ఞులైన అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.