Medaram : మేడారం హుండీల లెక్కింపు..10 రోజుల పాటు కొనసాగనున్న లెక్కింపు
X
తెలంగాణ కుంభమేళా అయిన మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ముగిసింది. దాదాపు కోటిన్నర మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అయితే మేడారంలో అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను ఇవాళ లెక్కించనున్నారు. ఇప్పటికే హుండీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పక్కనే ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. నిన్న తిరుగువారం కావడంతో మిగతా హుండీలను సైతం తెచ్చి కౌంటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మహాజాతర నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ జాతరలో మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేశారు.
వీటిలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద 215 హుండీలు..గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెల వద్ద 26 హుండీలతో పాటు, మరో 30 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. మిగతావి తిరుగువారం కోసం మేడారంలో ఉంచారు. లెక్కింపు జరిగే ప్రదేశంలో చుట్టూరా సీసీ కెమెరాలతో పాటు, 24 గంటలూ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు. కాగా మహాజాతర మొత్తం హుండీలను తీసి కానుకలను లెక్కించేందుకు సుమారు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.